Subscribe Us

Jago gor banjara, lambadi




 దేవుడులేడని చెప్పడం కూడా హక్కే! 

———————————————————


నీరు, నిప్పు, వాయువు, అగ్ని పదార్థాలతో ఈ విశ్వం, మానవ దేహం నిర్మితమైనవని తన పరిశీలనల వల్ల తెలియజెప్పినవాడు - అజిత కేశ కంబళి. ప్రపంచంలోనే తొలి భౌతిక పదార్థవాది. భారతీయుడు. నల్లని వెంట్రుకలతో నేసిన కంబళి కప్పుకోవడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. పూర్వం నుంచే ఈ దేశంలో ఎన్నో జీవన విధానాలు వర్థిల్లాయి. చార్వాకం, లోకాయతం, సాంఖ్యం, వైశేషికం, న్యాయం, బౌద్ధం, జైనం మొదలైనవి. ఇవేవీ మతాలు కావు. జీవన తాత్త్విక దర్శనాలు. చార్వాక లోకాయత దర్శనాలు - నాస్తిక దర్శనాలు. సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పుకోవాల్సిన ఇలాంటి దర్శనాల గురించి మనం చెప్పుకోం. ఇక మిగతా హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలు దర్శనాలు కావు. కేవలం మతాలు. మతిలేని మతాలు. వాటికి ఒక నైతికత / ధార్మికత లేదు. ఉండదు.


''వేదాలు ప్రామాణికం కాదు. యజ్ఞాలు మోక్షసాధనాలు కాదు. జంతు బలులు నిరసించాల్సినవి''- అని చెప్పిన మహావీరుడు అన్ని వర్ణాలు సమానమేనన్నాడు. బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించాడు. ఆయన సంవత్సర కాలంలో ఎనిమిది నెలలు దేశాటన చేసేవాడు. మిగిలిన నాలుగు నెలలు వైశాలి, చంప, రాజగృహ, మిథిల, శ్రావస్థి మొదలైన పట్టణాలలో కాలం గడిపేవాడు. ఈ పట్టణాలు నాటి జైనమత వ్యాప్తిని సూచిస్తాయి. 468 బి.సి.ఈ.లో పాటలీపుత్ర సమీపంలోని పావపురిలో, హస్తిపాలుడనే రాజుగారి గృహంలో అతిథిగా ఉన్నప్పుడు తన 72వ యేట నిర్యాణం చెందాడు. ఆ కాలంలో కేవలం జైనం, బౌద్ధం, అజీవక, చార్వాకం మాత్రమే కాదు, నాటి సమాజానికి సరికొత్త భావజాలం అందించడానికి సుమారు అరవైనాలుగు సంఘాలు పుట్టాయి. 


దేవుడు లేడని, ఆత్మ స్వర్గ నరకాలు లేవని, ప్రతిదానికీ కార్యకారణ సంబంధం ఉంటుందని మొదట చెప్పింది చార్వాకులే! ఆ విషయాల్ని బౌద్ధం బలపరిచింది. ఒక రకంగా భారతీయ తత్త్వ చింతనలో బౌద్ధం ఒక ముందడుగు - అయితే అది అన్యాయంగా అర్థాంతరంగా ముగిసింది. గుప్తుల కాలం నాటికి వైదిక ధర్మం బలం పుంజుకుంది. ఫలితంగా భారతీయ భౌతికవాదం బలహీనపడుతూ వచ్చింది. క్రమక్రమంగా సమాజం దానికి పూర్తిగా దూరమయ్యింది.


వార్తా పత్రికలు, రేడియో, టీవీలు శాస్త్రీయ విజ్ఞానంతో మనిషి కనుగొన్న మాధ్యమాలే - కానీ, అవి పొద్దుటి నుంచి అర్థరాత్రి వరకూ అశాస్త్రీయ మూఢనమ్మకాల అజ్ఞానం ప్రసారం చేస్తున్నాయి. దొంగ బాబాల ఉపన్యాసాలు, స్వాముల విన్యాసాలు వినిపిస్తున్నాయి. చూపిస్తున్నాయి. రుద్రాక్ష ధరించమని చెప్పడానికి ఒకడు, రంగురాళ్ళు ధరించమని మరొకడు. వీరేకాకుండా పేరులో అక్షరాలు మార్చుకోమని వేరొకడు వస్తుంటారు. సంఖ్యాశాస్త్రం, వాస్తు, జ్యోతిషం ప్రచారం చేయడానికి మరికొందరు వస్తారు. తప్పు వాళ్ళది కాదు. వాళ్ళను ప్రమోట్‌ చేస్తున్న ఆయా సంస్థల యాజమాన్యానిది. పూర్వాశ్రమంలో ఈ బాబాలు, స్వాములు అందరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారో లేక డ్రగ్‌ మాఫియా గాళ్ళో, హీనమైన రాజకీయాలు చేసే బ్రోకర్‌గాళ్ళో అయి ఉంటారు. లేదా చిట్టీ డబ్బులు ఎగ్గొట్టి, బోర్డులు తిప్పేసి పారిపోయిన దొంగస్వాములో అయి ఉంటారు. వీళ్ళ భరతం పట్టాలంటే మొదట వీళ్ళు పారిపోకుండా దేశ సరిహద్దుల్లో గట్టి నిఘా పెంచాలి. 


దేశంలోని ప్రసార మాధ్యమాలు జనం మూఢనమ్మకాల్లో మునిగిపోకుండా చేతనత్వంతో పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మెరుగైన సమాజం స్థాపించబడుతుంది. కానీ, మరో వైపు పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఉద్యోగులు కోట్ల లంచానికి అలవాటు పడ్డారు. సినీ తారలు డ్రగ్స్‌లో తేలిపోతున్నారు. చదువులేని వారంతా పాలకులవుతున్నారు. దేశంలో విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది. కాని విచిత్రం - విచక్షణ గలవారి సంఖ్య పెరగడం లేదు. ఈ పరిస్థితిని మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సామాన్య పౌరులుగా మనం ఆలోచించుకోవాల్సి ఉంది.


'దేవుడు సర్వాంతర్యామి' అని భావించే వారంతా ''దేవుడు లేడు. దేవుడు లేడు'' అని పేరియార్‌ రామసామి విగ్రహం కింద చెక్కి ఉన్న అక్షరాలు చూసి ఇబ్బంది పడుతున్నారని - దైవ నాయకం అనే అతను మద్రాస్‌ (చెన్నై) హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. కానీ, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దేవుడు ఉన్నాడని ప్రచారం చేసే హక్కు ఉన్నట్లే - దేవుడు లేడని చెప్పే హక్కు కూడా ఉంటుంది. రాజ్యాంగంలోని 13వ అధికరణం ప్రకారం భావ ప్రకటనను అందరూ తమకు నచ్చినట్టు చేయవచ్చు - అని ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇక మతసామరస్యం గురించి కొందరు పెద్ద పెద్ద మాటలు చెపుతుంటారు. కాని మనసులో ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉంటారు.


మతాలన్నీ మూఢనమ్మకాలకు ప్రతిరూపాలని మాత్రం గ్రహించరు. ఒక్కొసారి ఒక మతంలోని రెండు శాఖలు కలిసి మూడోదాన్ని నాశనం చేస్తాయి. లేదా ఒకదానికి మరొకటి సహాయపడతాయి. మత సామరస్యం అంటే ఒక మతం వాళ్ళు మరో మతానికి అడ్డుపడకుండా దేవుడు - దయ్యం - ఆచారం - సంప్రదాయం అంటూ జనం శ్రమని సమానంగా దోచుకోవడం - అన్నది.. వాస్తవం! నిజానికి మతాలకు గానీ, మత గురువులకు గానీ, వారి వారి దేవుళ్ళకు గానీ ఎక్కడా ఎప్పుడూ ఏ మహిమలు లేవన్నది ఇప్పుడొచ్చిన కరోనా తేటతెల్లం చేసింది. ఈ దేశంలో ఇంత మంది స్వాములు, బాబాలు, పాస్టర్లు, ముల్లాల నుంచి ఏ పాజిటివ్‌ వైబ్రేషన్సూ రాలేదు. ఏ ఒక్కరూ కరోనాను కట్టడి చేయలేకపోయారు. 


మళ్ళీ మనిషే తన మేథోశక్తిని ఉపయోగించి, వాస్తవంలోంచి నివారణ చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ''రామాయణ మంతా ఫేక్‌... బోగస్‌..'' అని అన్నాడు రమణానంద మహర్షి. ''రాముడు కృష్ణుడు మాంసాహారులే''నని అన్నాడు గరికపాటి. మరి వీళ్ళంతా హేతువాదులు కాదు, ఆధునిక ఆలోచనా ధోరణి గలవారమని చెప్పుకునే సంప్రదాయవాదులే!

అధికారంలో ఉండి, బాధ్యతాయుతమైన పదవులు నిర్వహిస్తున్న గౌరవనీయులు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో చూడండి. అన్ని రకాల మీడియాల్లో మనకు ఇవి కనిపిస్తూనే ఉన్నాయి. వీటిలో నిజమెంత అనేది దేశ పౌరులు ఎవరికి వారే, వారి వారి విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించి తేల్చుకోవాలి! ''ఐజాక్‌ న్యూటన్‌, ఐన్‌స్టీయిన్‌లు ఆర్య బ్రాహ్మణులే'' అని ఈ దేశ విదేశాంగ మంత్రి ప్రకటించారు.


 ''మహాభారత కాలం నాటికే ఓలా, ఉబర్‌ క్యాబ్‌లు వాడుకలో ఉన్న''ట్టు - త్రిపుర ముఖ్యమంత్రి ప్రకటించారు. పెట్రోలు ధరలు తగ్గాలని - పెట్రోలియం మంత్రి చండీయాగం చేశారు. చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించకుండా, ఒక సామాన్యుడి స్థాయికి అసహాయంగా పడిపోవడం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయమా? ఇంతటి ఘనాపాటి మరొక మంత్రిగారున్నారు. ఆయన పశుసంవర్ధకశాఖా మంత్రి. ఈయన దేశంలో నేరాలూ ఘోరాలూ తగ్గాలని ఆవులకు భగవద్గీత వినిపించారు. వర్షాల కోసం రెండు కప్పలకు పెండ్లి చేస్తారు గుజరాత్‌ విద్యామంత్రి. దేశ ప్రజల ఆరోగ్యం కోసం పిజ్జాలో చీజ్‌కు బదులు ఆవుపేడ పెట్టుకుని తినాలంటారు.. ఆరోగ్యశాఖా మంత్రి. దేశంలో జీడీపీ రేటు పెరగాలని అశ్వమేథయాగం చేయాలని సూచిస్తారు ప్రధానమంత్రి! ''రాహువు అనే పాము చంద్రుణ్ణి మింగి గంట తర్వాత కక్కుతుంది గనక, చంద్రగ్రహణం రోజు మగవారు ఊపిరి పీల్చుకోవద్దని.. అలా చేస్తే రక్తం కక్కుకుని ఛస్తారని జ్యోతిష బ్రహ్మ స్వామి బోడయ్య చెప్పారు.


ఇవన్నీ వాస్తవాలా? లేక ఎవరో కావాలని చేసిన వ్యంగ్య వ్యాఖ్యలా అని కొంతమందికి అనుమానం రావొచ్చు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ, అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలు దాదాపు ఇలాగే ఉంటున్నాయి. ఒక్కోసారి ఇంతకన్నా హీనంగా కూడా ఉంటున్నాయి. అందువల్ల పదేపదే చెప్పేదేమంటే సామాన్య పౌరులు వివేకవంతులు కావాలి. నిజానిజాలు బేరీజు వేసుకుంటూ ఉండాలి. 2020 సెప్టెంబర్‌ 10న భారత రక్షణ మంత్రి, ఫ్రాన్స్‌ రక్షణమంత్రి అంబాలా బేస్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసిన యుద్ధవిమానాల్ని భారత వాయుసేనకు అప్పగించడానికి ఏర్పాట్లు చేసిన కార్యక్రమం అది! అక్కడ సంప్రదాయం పేర 'సర్వ ధర్మ పూజ' జరిపించారు. ఆ పూజల వల్ల ఆ యుద్ధ విమానాల నైపుణ్యం ఏమీ పెరగదు. జరిపించనంత మాత్రాన తరిగేదీ లేదు. 


ఇతర దేశాల్లో ఇలాంటి పూజలు జరగవు. ధర్మబోధకులు ఉంటే ఉంటారు. కానీ వారిని వైజ్ఞానిక / పరిశోధక / రక్షణ రంగాలకు సంబంధించిన కార్యక్రమాలకు పిలవరు. మనదేశంలో మాత్రం ధర్మం పేరుతో అధర్మంగా జీవించే మూర్ఖుల్ని అనవసరంగా ఆహ్వానిస్తుంటారు. లేకపోతే ఇస్రో రాకెట్‌ ప్రయోగాలు జరుగుతూ ఉంటే అక్కడ జగ్గీవాసుదేవో మూడు శ్రీల రవిశంకరో ఎందుకూ? రాజకీయాల ఒత్తిడీ, ఉన్నతాధికారుల బలహీనతా కాకపోతే??


ఉన్నత స్థాయిలో ఉన్నవారిని చూసి, వారి కార్యక్రమాల్ని చూసి సామాన్యులు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు నిత్యజీవితంలోంచి ఎన్ని సంఘటనలైనా చెప్పుకోవచ్చు. 2020 జూన్‌ 30న ఛత్తీస్‌ఘడ్‌లో పిడుగుపాటుకు ఆవుపేడ వైద్యం జరిగింది. పిడుగుపడటం తో అక్కడ ఇద్దరు యువకులు, ఒక యువతి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకుపోకుండా, తీరిగ్గా ఒంటినిండా ఆవుపేడ పూస్తూ కాలయాపన చేశారు. వైద్యసహాయం అందక వారు మరణించారు. 


అమాయకులైన గిరిజనులు ఉండే ఆ గ్రామంలో మూఢనమ్మకాలు ఎక్కువ! ఉన్నత స్థాయి విద్యావంతుల్లో ఒకరకమైన మూఢనమ్మ కాలుంటే, మారుమూల గ్రామాల్లో విద్యా విహీనుల్లో మరొకరకమైనవి ఉన్నాయి. దీనికి కారణం పరిపాలకులు, అధికారులు, రాజకీయాలు, స్వార్థం, కుత్సిత బుద్ధి.. ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. సనాతన ధర్మం చెప్పినట్టు.. ''ధర్మం నాలుగు పాదాల మీద'' ఎప్పుడూ నడవలేదు. నాలుగు వర్ణాల మీదే నడిచింది. దానిలోంచే ఎక్కడా లేని మూఢనమ్మకాలు జనంలో జీర్ణించుకుపోయాయి. పరిస్థితి అలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం. అందరికీ సమానమైన విద్య, అవకాశాలు, హక్కులు, న్యాయం అందేదాకా సంఘర్షణ తప్పదు. అందుకే అర్జెంటినా మార్క్సిస్టు విప్లవకారుడు చే గువేరా అంటాడు.. ''21వ శతాబ్దపు మానవుల్ని అంటే మనల్ని మనం తయారుచేసుకోవాలి. కొత్త సాంకేతిక శాస్త్రంతో కొత్త స్త్రీ పురుషుల్ని తయారుచేసుకోవడానికి మనం రోజువారిగా కృషి చేస్తూ ఉండాలి'' అని!


''అసమానతలను, అన్యాయాలను, మత దురహంకారాన్ని చూసి ఎదరించలేకపోతే, కనీసం ఆ వ్యవస్థను చూసి నవ్వనైనా నవ్వండి!'' అని అన్నాడు విశ్వవిఖ్యాత నటుడు, దర్శకుడు, మానవవాది చార్లీ చాప్లిన్‌.

- డాక్టర్‌ దేవరాజు మహారాజు

వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.

Post a Comment

0 Comments